అమరవీరుల ఆశయాల సాధన కోసం మరో పోరాటం నిర్వహిస్తామని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడేళ్ల తెలంగాణ ఉద్యమ విలువల అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఉద్యమంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సభలో తెజస అధ్యక్షుడు కోదండరాంతో పాటు శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, విమలక్క, అద్దంకి దయాకర్, పోటు రంగారావు, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొన్నారు.
ఏడేళ్ల పాలనపై ప్రముఖుల అభిప్రాయాలు
పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యా, వైద్య రంగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని న్యూడెమోక్రసీ సీనియర్ నేత పోటు రంగారావు అన్నారు. ప్రభుత్వం ప్రతి అంశంలో ప్రజలను మభ్యపెట్టే వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేస్తున్న పాలనను కోరుకోలేదన్నారు.