రాష్ట్రంలో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 80,039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన ప్రభుత్వం.. తొలి విడతగా 30,453 నియామకాలకు ఆమోదం తెలిపింది. తాజాగా 3,334 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం రెండు విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరింది. ఈసారి కొలువులు యూనిఫామ్ సర్వీసు పోస్టులైన ఆబ్కారీ, అగ్నిమాపకం, అటవీ శాఖలవి. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి వీటికి ఆమోదం తెలపడంతో తాజాగా వీటిపైనా ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది.
మంత్రిమండలిలోనే యూనిఫామ్ సర్వీసు పోస్టుల అర్హతకు సంబంధించి వయో పరిమితిని మూడేళ్లు పెంచగా... దానిపైనా బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆబ్కారీ కానిస్టేబుళ్లు, అగ్నిమాపక పోస్టులు పోలీసు నియామక సంస్థ ద్వారా భర్తీ అవుతాయి. ఎక్సైజ్ శాఖలోని బెవరేజెస్ కార్పొరేషన్, మరికొన్ని పోస్టులు, అటవీ శాఖల పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. గ్రూపు-1, పోలీసు తదితర ఉద్యోగ నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.