గ్రేటర్ హైదరాబాద్ ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 11తో ముగియనుంది. దీంతో ఫిబ్రవరి 10లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి కమిషన్ చర్యలు ప్రారంభించింది. చివరిసారిగా 2002లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్ని బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించారు. 2009, 2016లో ఈవీఎంల ద్వారా జరిగాయి. 18 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు.
బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు - GHMC Elections 2020
త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్ని బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు వద్దని మెజార్టీ రాజకీయ పార్టీలు తేల్చి చెప్పడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుని సోమవారం ప్రకటన విడుదల చేసింది.
16 పార్టీలు బ్యాలెట్ బాక్సుల వైపు: కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరింది. గుర్తింపు పొందిన 11 పార్టీల్లో ఒక్క పార్టీ మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపింది. 5 పార్టీలు బ్యాలెట్ బాక్సులే మేలన్నాయి. 2 పార్టీలు ఏ విషయాన్నీ చెప్పలేదు. నమోదైన పార్టీల్లోనూ (పార్టీ గుర్తులేనివి) 11.. బ్యాలెట్ బాక్సులకు మొగ్గుచూపాయి. మొత్తంమీద మూడు పార్టీలే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరపాలనగా 16 పార్టీలు బ్యాలెట్ బాక్సులవైపు మొగ్గుచూపాయి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలంటే వివిధ దశల్లో ఆయా యంత్రాలను తనిఖీ చేసి సిద్ధం చేయాలి. ఇందులో వాటి తయారీ సంస్థల నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ సిబ్బంది పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఈవీఎం, వీవీపాట్ యంత్రాలను శుభ్రం చేయడానికీ పెద్దసంఖ్యలో కూలీలు అవసరం. ప్రస్తుత కరోనా తరుణంలో ఇంత భారీ కసరత్తు వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున.. బ్యాలెట్ బాక్సులతో ఎన్నికల నిర్వహణే మేలనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది.