తెలంగాణలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పాలకవర్గాలకు గడువు ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక శాఖను కోరింది. ఈమేరకు తాజాగా మరోసారి లేఖ రాసింది. ఇప్పటికే డిసెంబరు 14న రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయపరమైన వివాదాలకు అవకాశం లేకుండా చూడాలంటూ సూచించింది. రాజ్యాంగం నిర్దేశించినట్లుగా ఎన్నికల సంఘం గడువులోపు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం సహకరించాలని స్పష్టంచేసింది.
ఒకవేళ అలాంటి సహకారం అందకుంటే ఎన్నికల సంఘం హైకోర్టును, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చంటూ సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పును ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. మార్చి మొదటివారంలో ఎన్నికలు పూర్తయితేనే పాలకవర్గాల గడువు ముగిసేలోపు ఛైర్మన్, మేయర్ ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని వివరించింది.
మార్చి 14 వరకు గడువు
వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు ఆరు పురపాలక సంఘాలకు మార్చి మొదటివారంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి ఆదేశించింది. వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు, అచ్చంపేట పురపాలికల పాలకవర్గాల గడువు మార్చి 14న ముగుస్తుండటంతో ఆలోపు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉందని గుర్తు చేసింది. వీటితోపాటు సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు, జహీరాబాద్ పురపాలక సంఘాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉందని పేర్కొంది. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఖరారు వంటివి చేయాల్సి ఉందని వివరిస్తూ.. ఇప్పటికే డిసెంబరు 14న పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి పంపిన ఉత్తర్వుల్లో ఆ తేదీలను కూడా నిర్దేశించినట్లు ఎన్నికల సంఘం గుర్తుచేసింది. సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో ముగుస్తుందని, నకిరేకల్ పంచాయతీ గడువు డిసెంబరు 15న ముగిసి పురపాలక సంఘంగా మారిందని పేర్కొంది. కొత్తూరు కొత్త పురపాలక సంఘంగా ఏర్పాటు కాగా జడ్చర్ల, జహీరాబాద్ పురపాలక సంఘాలకు గతంలో ఎన్నికలు జరగనందున వాటికీ నిర్వహించాల్సి ఉందని వివరించింది.