Payment Of E-Challans: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలాన్ జారీ ఆన్‌లైన్‌లో చెల్లింపు విధానంలో మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. నగదు రహిత చలానాల ద్వారా కేవలం 45రోజుల్లో రాష్ట్ర ఖజానాకు రూ.304కోట్లు జమయ్యాయి. దేశంలోనే నగదు రహిత చలానాల ద్వారా భారీగా వసూలు కావడం ఇదే ప్రథమం. క్యాష్‌లెస్ చలాన్ అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ పలు పురస్కారాలను అందుకుంది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ‘క్యాష్‌లెస్ చలాన్’ను దేశ రాజధాని దిల్లీ సహా ఇతర మెట్రోనగరాల్లోనూ అమలు చేయడం లేదు. ఇప్పుడిప్పుడే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ట్రాఫిక్ పోలీసులు పర్సనల్ డివైస్ అసిస్టెంట్(పీడీఏ) ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి పెండింగ్ చలానాలను తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మీసేవా కేంద్రాల్లో జరిమానాలను చెల్లించాలంటూ సూచిస్తున్నారు.
రాయితీ ప్రకటనలతో రూ. 9కోట్ల చలాన్లు ఉఫ్:కరోనా వైరస్ ప్రభావంతో లక్షలమంది వాహనదారులను ఈ-చలాన్‌లను చెల్లించడం మానేశారు. వీటిని వెంటనే చెల్లించండి అంటూ ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో కేవలం 45రోజుల్లో రూ. 9కోట్ల పెండింగ్ చలానాలు క్లియర్ అయ్యాయి. వీరంతా చలానాలను వారి చరవాణుల్లోనే జరిమానాలను చెల్లించారు. దీంతో ఉల్లంఘనులకు సమయం ఆదా అవగా.. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు రహదారులపై వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అక్రమపార్కింగ్, రాష్ డ్రైవింగ్, రెడ్‌లైట్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, స్పీడ్ డ్రైవింగ్ వంటివి చేశారంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సగటున రోజుకు 10వేల వాహనాలకు ఈ-చలానాలు పంపుతున్నారు. వీటిని వారం రోజుల్లో చెల్లించాలి. చెల్లించని వారిని గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వారిచేత ఆన్‌లైన్‌లో చలానాలు కట్టిస్తున్నారు.
పురస్కారాలు.. అధ్యయనాలు:ట్రాఫిక్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చిన నగదు రహిత చలానా విధానానికి జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు లభించాయి. అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఉండడం, ట్రాఫిక్ పోలీసుల నుంచి వేధింపులు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానం వివిధ ప్రభుత్వ శాఖలను ఆకర్షించింది. ఫిక్కీ, స్కోచ్ పురస్కారాలు లభించాయి. నగదు రహిత చలానా అమలు తీరుపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, పుణా పోలీస్ ఉన్నతాధికారులు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. నగదు రహిత చలానా ఎలా ఇస్తున్నారు? ఎన్నిరోజుల్లో ఖజానాకు నగదు జమ అవుతోంది? పెండింగ్ చలానాలు వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అన్న అంశాలపై అధ్యయనం చేశారు. ట్రాఫిక్ పోలీసు అధికారుల నుంచి వీడియోలు, నగదు రహిత చెల్లింపు విధాన పత్రాలను తీసుకెళ్లారు. పుణా, బెంగళూరు నగరాల్లో ‘క్యాష్‌లెస్ చలానా’విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే వంటి ఈ-వ్యాలెట్ సంస్థలతో ఒప్పందాలు కుదరకపోవడంతో అక్కడికి ఆగిపోయాయి.