శాసన మండలిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పేరిట యువతను మభ్యపెట్టొద్దని విపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్ రంగాల్లోకి మన యువత వెళ్లడం లేదని.. ఏ రంగంలో అవకాశాలున్నాయో యువతకు తెలిపి తర్ఫీదు ఇస్తామన్నారు. అందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాలయాపన చేయకుండా ఎవరికి తోచిన రంగాల్లో వారు రాణించాలని సీఎం సూచించారు.
తను బతికున్నంత కాలం రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, బీమా అమలవుతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని ముఖ్యమంత్రి తెలిపారు. పాజిటివ్ కేసు బాధితునికి వైరస్ ఇక్కడ పుట్టలేదని... ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగుల పీఆర్సీ విషయంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. ఉద్యోగులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ను కూడా త్వరలో ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.
దశల వారీగా పాఠశాలల అభివృద్ధి:
రాష్ట్రంలో పాఠశాల విద్యను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్య అందడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల బిడ్డలను కూడా ప్రైవేటు ఆంగ్ల పాఠశాలకు పంపిస్తున్నారని.. విద్యకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. దిల్లీ ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ఇక్కడి పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మార్చుతామని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ తీసుకొస్తామని.. ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూల్ చేస్తే కుదరదన్నారు. విశ్వవిద్యాలయాల్లో త్వరలోనే వీసీలను నియమించి.. కావాల్సిన సిబ్బంది నియామకం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంబంధ విషయాలపై త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసి.. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరుద్యోగ భత్యం ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదని... ఎవరికి ఇవ్వాలో స్పష్టత వచ్చాక అమలు చేస్తామని చెప్పారు.