చిల్లర మార్కెట్‌లో కిలో కందిపప్పు ప్రస్తుతం రూ.100 నుంచి 110 వరకూ ధర పలుకుతోంది. కానీ గతేడాది రైతుల నుంచి మద్దతు ధరకు కొన్న రెండున్నర లక్షల క్వింటాళ్ల కందులను రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య(మార్క్‌ఫెడ్) అతి తక్కువ ధరకే వ్యాపారులకు అమ్మింది. క్వింటా కందులను రూ.4,181 చొప్పున కొంటామంటూ వ్యాపారులు వేసిన టెండర్లను ఆమోదించి అప్పగించింది. క్వింటా కందులను ఆడిస్తే 68 కిలోల పప్పు వస్తుంది. అంటే కిలో పప్పు రూ.61.48కే వ్యాపారులకు దక్కినట్లయింది!
నిజానికి 2019లో కందులను క్వింటాకు ఖర్చులన్నీ కలిపి రూ.5,675కు రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. కొన్న ఖర్చులు, నిల్వ, రవాణా, గోదాముల అద్దెలు తదితరాలన్నీ కలిపి క్వింటా సరకును రూ.6వేలకు అమ్మితేనే సొమ్ము మొత్తం వెనక్కి వచ్చేది. కానీ రూ.4,181కే అమ్మడం వల్ల మార్క్‌ఫెడ్‌కు రూ.60కోట్ల వరకూ నష్టం వచ్చింది. కానీ బహిరంగ మార్కెట్‌లో కందులు అమ్మడానికి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని, నాలుగోసారి టెండర్‌లో వ్యాపారులు కోట్ చేసిన ఎల్1 ధర రూ.4,181కే ఇచ్చినట్లు మార్క్‌ఫెడ్ ప్రభుత్వానికి నివేదించింది. పాత కందులు కావడం వల్ల ధర పెద్దగా రాలేదని తెలిపింది.