తెలంగాణ

telangana

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు మాణిక్కం ఠాగూర్​ దూరంగా ఉంటున్నారా..?

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ దూరంగా ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలకు తీవ్రంగా కృషి చేసిన ఆయనకు.. అక్కడి ఫలితాలు తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలై అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల హడావుడి ఉన్నా.. మాణిక్కం ఠాగూర్‌ కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.

By

Published : Nov 20, 2020, 10:27 PM IST

Published : Nov 20, 2020, 10:27 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు దూరంగా మాణిక్కం ఠాగూర్​!
జీహెచ్​ఎంసీ ఎన్నికలకు దూరంగా మాణిక్కం ఠాగూర్​!

తెలంగాణలో జరుగుతున్న కీలకమైన హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్‌ దూరంగా ఉన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల విషయంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించడమే కాకుండా.. పార్టీ రాష్ట్ర యంత్రాంగం అక్కడే మకాం వేసేలా ప్రణాళికలు రచించారు. బూతుస్థాయి నుంచి ఇంఛార్జిలను నియమించిన ఆయన.. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో స్వయంగా కూడా పాల్గొన్నారు. తన మార్కు రాజకీయం స్పష్టంగా కనిపించేలా చేశారు.

అయితే అక్కడ ఫలితాలు ఆశించిన మేరకు రాకపోవటం వల్ల ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలై అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల హడావుడి ఉన్నా.. మాణిక్కం ఠాగూర్‌ కనిపించడం లేదు. ఆయన అందుబాటులో లేకపోవటానికి పార్టీలో నెలకొన్న విభేదాలే కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఠాగూర్‌ వయసులో చిన్నవారు కావడం.. కొందరు సీనియర్‌ నాయకులు ఆయనకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఠాగూర్‌ ఏదైనా చెప్పినా దానిని తేలికగా తీసుకోవడం లాంటివి తీవ్ర ఇబ్బందికి గురి చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొందరు నేతల వ్యవహార శైలి ఆయనకు తీవ్ర మనోవేదన కలిగించినట్టు చెబుతున్నారు. కొందరు సీనియర్లు జీహెచ్‌ఎంసీ టిక్కెట్లు అమ్ముకున్నట్లు.. ఠాగూర్‌ దృష్టికి రావటం వల్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మ్యానిఫెస్టో విడుదలకు ఆయన వస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నా.. ఆ జాడ కనిపించడం లేదు.

అయితే శుక్రవారం జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశంలో ఠాగూర్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details