TS Cabinet Meeting in New Secretariat : కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ త్వరలోనే జరగనుంది. మంత్రివర్గాన్ని సమావేశపరిచి.. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా గవర్నర్ తిప్పిపంపిన బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు కేబినెట్‌ను సమావేశ పరచవచ్చని ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టుల పదవీ విరమణ వయస్సు పెంపు కోసం చేసిన చట్టసవరణ బిల్లుతో పాటు పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లును గవర్నర్ వెనక్కు పంపారు.
: ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, పంచాయతీరాజ్, అజామాబాద్ పారిశ్రామిక వాడల చట్ట సవరణ బిల్లులపై ప్రభుత్వ వివరణ కోరారు. దీంతో వీటి విషయంలో తదుపరి ఏం చేయాలన్న విషయమై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్‌కు మళ్లీ పంపాలని అనుకుంటే ఉభయసభలను సమావేశపరిచి చర్చించి ఆమోదించి పంపవచ్చు. అకాల వర్షాలకు పంట నష్టం, పోడుభూముల పట్టాల పంపిణీ, దళిత బంధు, గృహలక్ష్మి, తదితర అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీకాలం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. దీంతో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. దిల్లీ పర్యటన కూడా పూర్తయిన నేపథ్యంలో సంబంధించిన అంశాలపై సీఎం దృష్టి సారిస్తారని, త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఉంటుందని ప్రభుత్వ, పార్టీ వర్గాలు అంటున్నాయి.