Telangana Cabinet Meeting: కొవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడినా... ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల వారిగా టీకా ప్రక్రియపై సమీక్షించిన సీఎం... ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్లో కొనసాగుతోంది. ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి శాఖ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, ఔషధాల లభ్యత, ఆక్సిజన్ పడకలు, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించారు.
సీఎంకు నివేదిక
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.... అధికారుల సన్నద్ధత, కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. వివిధ దేశాల్లో బయటపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. ఆ దేశాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు నివేదిక అందించారు. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని, అన్ని రకాల మందులు, పరికరాలు , మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు.