Telangana Budget Sessions 2023-24 : ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సాధారణ చర్చతో పాటు పద్దులపై కూడా ఇప్పటికే చర్చ పూర్తయ్యింది. శాసనసభలో గత మూడు రోజులుగా మొత్తం 37 పద్దులపై చర్చించి ఆమోదించారు. దీంతో ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరగనుంది.
మొదట శాసనసభలో, ఆ తర్వాత మండలిలో చర్చ చేపడతారు. ఆర్థికశాఖా మంత్రి హరీష్‌రావు 2023 - 24 ఆర్థిక సంవత్సరం ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనుండగా... బిల్లుపై చర్చకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. మండలిలో హరీష్ రావు సమాధానం ఇస్తారు. బస్తీ దవఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, మామిడి మార్కెట్, పంట రుణాల మాఫీ, కోతుల బెడద, అక్షరాస్యత అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.
అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించిన వ్యవసాయ విశ్వవిద్యాలయ, పురపాలక, పంచాయతీరాజ్ చట్టసవరణల బిల్లులతో పాటు 2022 - 23 బడ్జెట్ అదనపు అంచనాలపైనా మండలిలో చర్చ జరగనుంది. జీఎస్టీ పరిహారం, ఆర్టీసీచే హైస్పీడ్ డీజిల్ వినియోగం, భవన క్రమబద్దీకరణ , గురుకులాల్లో డిప్యూటీ వార్డన్ల నియామకం, దివ్యాంగులకు సంక్షేమ పథకాలు, జంట నగరాల్లో మెట్రో రైల్ విస్తరణ, పురావస్తు సంపద పరిరక్షణ, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అంశాలు కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.