తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయానికి పెద్ద పీట.. రైతుబంధుకు అధిక కేటాయింపులు - తెలంగాణ బడ్జెట్​ వార్తలు

శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. 2020-21 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలు ప్రవేశపెట్టారు. కీలక వ్యవసాయ శాఖకు రూ. 24,116 కోట్లు కేటాయించింది. రైతుబంధు పథకం కింద రూ. 14 వేల కోట్లు, రైతు బీమాకు రూ. 1,141 కోట్లు, రుణమాఫీ పథకానికి 6, 225 కోట్ల చొప్పున ప్రతిపాదించింది. రుణమాఫీ పథకానికి సంబంధించి 25 వేల రూపాయలలోపు ఉన్న రైతుకు ఈ నెలలో చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. పంటల కొనుగోలు కోసం మార్కెటింగ్​ శాఖకు రూ. 1000 కోట్లు కేటాయించింది.

వ్యవసాయానికి పెద్ద పీట.. రైతుబంధుకు అధిక కేటాయింపులు
వ్యవసాయానికి పెద్ద పీట.. రైతుబంధుకు అధిక కేటాయింపులు

By

Published : Mar 9, 2020, 6:20 AM IST

Updated : Mar 9, 2020, 6:32 AM IST

వ్యవసాయానికి పెద్ద పీట.. రైతుబంధుకు అధిక కేటాయింపులు

వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు కేటాయించింది. గతంలో ఎన్నడూ లేనిరీతిలో తొలిసారిగా పంటలను మద్ధతు ధరకు కొనేందుకు ప్రత్యేక నిధి కింద రూ. 1000 కోట్లు మార్కెటింగ్ శాఖకు కేటాయింపు చేసింది. ఇతర కేటాయింపుల్లో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకు నిధులు సింహభాగం దక్కాయి. వ్యవసాయ శాఖ మొత్తం కేటాయింపుల్లో 88.59 శాతం నిధులు ఈ మూడు పథకాలకే దక్కాయి. 2019-20 కంటే 2020-21లో రూ. 4 వేల కోట్ల నిధులు ఎక్కువగా కేటాయించారు.

రైతుబంధుకు 12 వేల కోట్లు:

ఈ ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు పథకానికి 12 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. అదనంగా కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న రైతుల సంఖ్య పెరగినందున బడ్జెట్‌లో మరో రూ. 2 వేల కోట్లు పెంచి ఇచ్చారు. రుణమాఫీ అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఒక్కో రైతుకు ఉన్న లక్ష రూపాయల లోపు రుణం మాఫీ చేస్తారు. ఇందులో భాగంగా తొలుత రూ. 25 వేలలోపు బకాయిలు ఉన్న 5.83 లక్షల మంది రైతుల అప్పు మొత్తం ఒకేసారి తీర్చేయాలని నిర్ణయించింది. ఈ నెలలోనే రూ. 1,198 కోట్లు విడుదల చేయనుంది. ఈ సొమ్మును రైతుకు నేరుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల రూపంలో పంపిణీ చేయనుంది. ఇక 25 వేల నుంచి లక్ష రూపాయలు బకాయిు ఉన్న రైతుల రుణాల మాఫీ కోసం 24,738 కోట్ల రూపాయలు కేటాయించింది. మిగిలిన పథకాలకు నిధుల కేటాయింపు, వ్యయం పెద్దగా లేవు. వ్యవసాయ పంటలకు మద్ధతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య - మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తోంది.

రైతు వేదికల నిర్మాణం:

ఉద్యాన శాఖలో బిందు సేద్యం పథకం అమలుకు రూ. 600 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఏడాదిలో నిధులు లేక ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ప్రతి 5 వేల ఎకరాల రైతులు ఒక చోట చేరి సమావేశమయ్యేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టనుంది. హక్కుల సాధనలో అసంఘటితంగా ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేయాలన్న బృహత్తర లక్ష్యంతో ఒక్కో రైతువేదిక నిర్మాణానికి రూ. 12 లక్షల చొప్పున ఖర్చు చేస్తారు. ఇందుకోసం రూ. 350 కోట్లు కేటాయించడం విశేషం.

రైతుబంధుకు నిధులు పెరిగిన తీరు (కోట్ల రూపాయల్లో):

సంవత్సరంనిధులు
2018-19 10,479
2019-20 12,000
2020-21 14,000

ఇవీ చూడండి:తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

Last Updated : Mar 9, 2020, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details