కొవిడ్ పరిస్థితుల(corona effect on education) వల్ల విద్యా సంవత్సరం గందరగోళంగా మారినందున ఈ విద్యా సంవత్సరం కూడా పదో తరగతి పరీక్షల విధానంలో పలు మార్పులు ఉంటాయని విద్యా శాఖ(telangana education department ప్రకటించింది. గత విద్యా సంవత్సరం పలు కీలక మార్పులు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చివరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ ఉత్తీర్ణుల్ని చేసింది. ఈ ఏడాది కూడా విద్యాసంవత్సరం గాడిలో పడనందున... గత ఉత్తర్వులను ఈ విద్యా సంవత్సరం కూడా అమలు చేయనున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు.
పదిలో ఆరు పరీక్షలే
పదో తరగతిలో గతంలో ఉన్న 11 పరీక్షల(ssc exams)ను ప్రభుత్వం ఆరుకు కుదించింది. ద్వితీయ భాష మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు ఇంతకు ముందు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో పరీక్షలో 40 మార్కులు ఉంటున్నాయి. ఈ ఏడాది ప్రథమ భాష, ద్వితీయ భాష, ఆంగ్లం, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్లు ఇవ్వాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. పరీక్ష సమయాన్ని మరో అరగంట పొడిగించారు. ఇంతకు ముందు 2 గంటల 45 నిమిషాల పాటు పరీక్ష ఉండగా.. ఈ ఏడాది 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష సమయం ఉంటుంది. సైన్సు పరీక్షలో విద్యార్థులకు రెండు సమాధాన పత్రాలు ఇస్తారు. ప్రశ్నపత్రం పార్ట్ ఏలోని భౌతిక శాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు ఒకదానిలో, పార్ట్ బీలోని జీవశాస్త్రం సమాధానాలు మరో దానిలో రాయాలి. మార్కుల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఎఫ్ఏ పరీక్షలకు 20, బోర్డు పరీక్షకు 80 మార్కులు యథాతథంగా ఉంటాయని తెలిపింది.