Telangana irrigation projects: నీటిపారుదల రంగానికి కేసీఆర్ సర్కార్ మొదటి నుంచి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు సాగునీటి రంగంపై 20 వేల కోట్లు ఖర్చు చేయగా.. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంది రూ. 13,638 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించింది రూ.6,442 కోట్లు ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న 8,467 కోట్లు, రాష్ట్ర ఖజానా నుంచి 1,892 కోట్లు కలిపి.. మొత్తం 10,360 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత అత్యధికంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 5,553 కోట్లు వెచ్చించారు. మొత్తం వ్యయంలో 75 శాతం ఈ రెండింటికే కేటాయించగా.. మిగిలిన ప్రాజెక్టులకు తక్కువగానే ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలలు ఉన్నందున ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు సుమారు రూ. 25 వేల కోట్లకు చేరే అవకాశం ఉంది.
పాలమూరు-రంగారెడ్డి’లో అధికంగా.. జనవరి ఆఖరు వరకు సాగునీటి ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పునరావాసం పనులకు 7,600 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, ఇందులో గుత్తేదారులకు చెల్లించాల్సిందే సుమారు రూ.4,200 కోట్లు. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.740 కోట్లు, ఎల్లంపల్లికి రూ.350 కోట్లు చెల్లించాల్సిన బిల్లులున్నాయి. కాళేశ్వరానికి బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణానికి చెల్లించాల్సిన మార్జిన్ మనీ 1,800 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరం, వరద కాలువ, ఎల్లంపల్లి, పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల కింద ఎక్కువగా పెండింగులో ఉంది.