Telangana Budget Sessions 2023: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం నుంచి సమావేశాలున్నందున ఇవాళ అసెంబ్లీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా.. ఏర్పాట్లు చేయాలని స్పీకర్ చెప్పారు. కొన్నిసార్లు ఎమ్మెల్సీలకు తగిన ప్రొటోకాల్ ఉండటం లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇద్దరు ఎమ్మెల్సీలకు జరిగిన అవమానంపై తన కార్యదర్శి ద్వారా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. కొన్నిసార్లు స్వయంగా తనకే అవమానం జరుగుతోందన్నారు. ఇక ముందు అలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సమావేశంలో శాసన వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సీపీ సీవీ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
ఉభయసభలను ప్రొరోగ్ చేయకుండానే: ఉభయసభలను ప్రొరోగ్ చేయకుండానే.. గత సమావేశాలకు కొనసాగింపుగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు జరపాలనేది శుక్రవారం సభ ముగిసిన అనంతరం బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్ సమావేశాలు:హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ, రాజ్‌భవన్ తరఫు న్యాయవాదుల మధ్య చర్చల అనంతరం రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంతరెడ్డితోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు కొందరు అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్ సమావేశాలపై గవర్నర్‌తో చర్చలు జరిపారు.