Congress leaders meet: తార్నాకలోని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో పొన్నాల, వీహెచ్, కమలాకర్‌రావు, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, జి.నిరంజన్, శ్యామ్‌మోహన్ పాల్గొన్నారు.
పీసీసీ నిర్ణయాలు సీనియర్లకు చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అసంతృప్తిగా ఉన్నారు. వీరంతా పీసీసీ చీఫ్ రేవంత్ నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తితోనే నేతలంతా సమావేశమైనట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఇంట్లో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించారు. తాజా భేటీలో దాదాపు 13 నుంచి 14 మంది సీనియర్ నేతలు సమావేశమైనట్టు సమాచారం. మరికొందరు నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ఏఐసీసీలో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌లో రాజకీయాలపైనా చర్చించినట్లు సమాచారం. నిన్న సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలపడంతో పాటు పీసీసీ నిర్ణయాలు, కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఏకపక్షంగా ముందుకెళ్తున్నట్టు భావిస్తున్న వీరంతా పీసీసీకి తగిన రీతిలో సలహాలు, సూచనలు చేయాలా? లేదంటే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలా అనే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే చర్చించాం: శ్రీధర్ బాబు
మర్రి శశిధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా పిలిచారని.. సభా సమావేశాలు జరుగుతున్నందున ఒక్కసారి వచ్చిపోవాలని ఆహ్వానించారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే చర్చించామన్నారు. తనకు వేరే పని ఉన్నందున మధ్యలోనే వెళ్లిపోతున్నట్లు చెప్పారు.