Telangana got two central awards : తెలంగాణ మరో రెండు ప్రతిష్ఠాత్మక కేంద్ర పురస్కారాలకు ఎంపికైంది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో నూటికి నూరుశాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ సాధించిన రాష్ట్రంగా ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజున విడుదల చేసిన సర్వే ఫలితాల్లో ఈ ఘనత దక్కించుకుంది. ఓడీఎఫ్ ప్లస్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులను ప్రకటించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించినట్లు వారు ప్రకటించారు.
ఓడీఎఫ్ ప్లస్ అంటే..మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్‌గా పరిగణిస్తారు. అదనంగా గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, చెత్తను సేకరించడానికి గ్రామానికి ట్రాక్టర్ సమకూర్చడం, చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుల్లో తడిచెత్త, పొడిచెత్తగా వేరు చేయడం, ఇంకుడు గుంతలు నిర్మించడం శ్మశాన వాటికను నిర్మించడం, రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి పనులు చేపడితే దానిని ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తిస్తారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్ ప్లస్, స్వచ్ఛతను పాటిస్తున్న గ్రామాల పురోగతి వివరాలను నమోదు చేయడానికి అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, వసతుల వివరాలను నమోదు చేశారు. వీటి సమాచారం ఆధారంగా తెలంగాణ ప్రగతిని కేంద్రం గుర్తించి, పురస్కారాలకు ఎంపిక చేసింది.