సచివాలయ భవనాల కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2016 కన్‌స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్‌కు లోబడి ప్రణాళిక రూపొందించినట్లు రహదారులు, భవనాల శాఖ పేర్కొంది. ప్రస్తుత సచివాలయ ప్రాంగణం హుస్సేన్‌సాగర్‌కు దక్షిణాన 25ఎకరాల విస్తీర్ణంలో 11పరిపాలన బ్లాకులుగా ఉందని తెలిపింది. బ్లాకులను వేర్వేరు సమయాల్లో నిర్మించారని, పురాతనమైన జీ బ్లాకును నిజాం హయాంలో 132ఏళ్ల క్రితం నిర్మించినట్లు పేర్కొంది. మొత్తం 11 బ్లాకులకు ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదని, ఎలాంటి రక్షణ చర్యలు లేవని ఆర్ ఆండ్ బీ తెలిపింది.
దాదాపు లక్ష టన్నుల వ్యర్థాలు
పాడైపోయిన స్థితితో పాటు సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, విడివిడిగా ఉండడం, తదితర కారణాల వల్ల ప్రస్తుత భవనాలను కూల్చి అదే ప్రాంతంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. 25.50ఎకరాల విస్తీర్ణణానికి గానూ 11బ్లాకులు 5.47ఎకరాల విస్తీర్ణంలో 9.87లక్షల చదరపు అడుగుల్లో ఉన్నాయని వివరించింది. మొత్తం విస్తీర్ణంలో 21.45 శాతంగా పేర్కొంది. మొత్తం 11బ్లాకుల కూల్చివేతతో 99వేల 670టన్నుల వ్యర్థాలు ఏర్పడతాయని అంచనా వేసింది. ఇందులో కాంక్రీట్, స్టీల్, కలప, ప్లాస్టిక్ ఇటుకలు, మోర్టార్ ఉంటుందని తెలిపింది. అత్యధికంగా 72వేల 620టన్నుల కాంక్రీట్ వ్యర్థాలు ఉత్పన్నం అవుతాయని పేర్కొంది.
తరలింపునకు నెల రోజులు
జులై 6నుంచి 12 వరకు కూల్చివేతలు చేపట్టి 13నుంచి ఆగస్టు 12వరకు నెలరోజుల్లో వ్యర్థాలను తరలించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు, వ్యర్థాల తరలింపునకు వాహనాలు సమకూర్చాల్సిందిగా జీహెచ్‌ఎంసీని కోరినట్లు చెప్పింది. వ్యర్థాల సేకరణ విభజన, నిల్వ కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దుమ్ము, ధూళి రాకుండా శబ్దకాలుష్యం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యర్థాల రవాణా కోసం చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
అత్యాధునిక యంత్రాలు
కూల్చివేత కోసం అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. కాంక్రీట్‌ను తొలగించేందుకు అతిఎత్తైన యంత్రాలను వినియోగిస్తున్నట్లు చెప్పింది. 26మీటర్ల ఎత్తు ఉన్న ఒక యంత్రాన్ని, 22మీటర్ల ఎత్తున్న మూడు యంత్రాలను, 16మీటర్ల ఎత్తున్న మరో యంత్రాన్ని వినియోగిస్తున్నట్లు వివరించింది. 20టన్నుల సామర్థ్యం గల ఎక్స్ కావేటర్లు ఎనిమిది వినియోగిస్తున్నట్లు పేర్కొంది. వ్యర్థాల విభజన కోసం బ్రేకర్లు ఉన్న 20 టన్నుల సామర్థ్యం కలిగిన ఎక్స్ కావేటర్లు నాలుగు, 20 టన్నుల సామర్థ్యం ఉన్న బకెట్లు ఉన్నవి మరో నాలుగు, మూడు డంపర్లను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. వ్యర్థాల తరలింపు కోసం 25 టన్నుల సామర్థ్యం కలిగిన 25 టిప్పర్లను వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ ప్రణాళికను జీహెచ్ఎంసీకి పంపినట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు..