Telangana Rythu Bandhu Funds Released 2023 :వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, అధికారులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు జరిగిన సమీక్షలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.
Govt Releases Rythu Bandhu Funds :రైతులకు పంట పెట్టుబడి సాయంపై సమావేశంలో చర్చ జరిగింది.రైతుబంధు(Rythu Bandhu Scheme) అమలు తీరు, లబ్ధిదారులు, వ్యయం, సంబంధిత అన్ని అంశాలను అధికారులు వివరించారు. సాగు చేయనప్పటికీ ప్రతి భూమికి పెట్టుబడి సాయం ఎందుకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాగులో లేని, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న భూములకు డబ్బులు ఇవ్వడం వల్ల రైతులకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించినట్లు సమాచారం. రైతుబంధుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. శాసనసభ వేదికగానే రైతుబంధుకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పినట్లు తెలిసింది.
రైతులకు బోనస్, రైతుబంధు ఎప్పుడు ఇస్తారు : హరీశ్‌రావు
CM Revanth Reddy On Rythu Bandhu Funds :ప్రస్తుత సీజన్‌కు పంట పెట్టుబడి సాయం విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాము హామీ ఇచ్చిన రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా విధివిధానాలు ఖరారు కానందున ఎన్నికల సమయంలో నిలిచిపోయిన రైతుబంధు చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే చెల్లింపులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సాయం అందించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు రైతుబంధు చెల్లింపులను ప్రారంభించారు.