TSRTC AC Sleeper Buses: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొదటి సారిగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఏసీ స్లీపర్ బస్సులను తీసుకువస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు జర్నీ మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. టీఎస్ఆర్టీసీ ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి.
ఈ బస్సులను మొదటగా కొన్ని ప్రధాన మార్గాలలో అనగా కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా టీఎస్ఆర్టీసీ నామకరణం చేసింది. హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త నమూనా ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సజ్జనార్ ఆదేశించారు. రాష్ట్రంలో తొలిసారిగ అందుబాటులోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఎండీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.