రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ. ఆర్టీసీ సమ్మె అనంతరం తిరిగి ప్రక్షాళన చేసేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత..అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పనిచేయడం ప్రారంభించారు. ఆర్టీసీ అతి కొద్దిరోజుల్లోనే నష్టాలను వీడి లాభాలబాటలో పయనిస్తుందని అంతా అనుకున్నారు. అంతలోనే ఉన్నట్టుంది కరోనా మహమ్మారి వచ్చిపడింది.
ఓ.ఆర్ 40 శాతం దాటడంలేదు...
లాక్‌డౌన్‌కు ముందు 9,691 (ఆర్టీసీ బస్సులు 6,553... 3,138 అద్దె బస్సులు)ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 81 లక్షల 28వేల పైచిలుకు మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణం చేసేవారు. ఓ.ఆర్ 70 శాతంకి పైగా వచ్చేది. అతికొద్దిరోజుల్లోనే ఆర్టీసీకి తిరిగి మంచి రోజులు వస్తాయని అందరూ అనుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో 55 రోజుల పాటు ఆర్టీసీ బస్సులు కేవలం డిపోలకే పరిమితమయ్యాయి. సరిగ్గా మే 18వ తేదీ నుంచి తిరిగి బస్సులు రోడ్డెక్కాయి. కానీ..అంతకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభమైన తర్వాత ఓ.ఆర్ కేవలం 28 శాతమే మాత్రమే నమోదైంది.
మాస్క్‌లు ధరిస్తేనే అనుమతి...
బస్సులను శానిటైజేషన్ చేసే పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే మాస్క్‌లు ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా 40 శాతం ఓ.ఆర్కు కూడా చేరుకోలేదు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 5వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. 1,200 పైచిలుకు అంతరాష్ట్ర , 3,500 పైగా ఉన్న గ్రేటర్ ఆర్టీసీ బస్సులు ఇప్పటికీ రోడ్డెక్కలేదు. నడుస్తున్న ఐదువేల బస్సులకు వస్తున్న ఆదాయం డీజీల్, బస్సుల మెయింటనెన్స్‌కు మాత్రమే సరిపోతుందని ఒకరిద్దరు ఉన్నతాధికారులు వాపోతున్నారు.