TSRTC Dussehra offer :దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. దసరా సందర్భంగా ప్రయాణం కోసం ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 29వ తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ.. ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
Telangana RTC Dussehra offer :రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని సజ్జనార్ తెలిపారు. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుందని అన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
Telangana RTC Dussehra Discount :సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రయాణికులను ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే డే పాస్, వృద్ధులకు, మహిళలకు ఆఫర్లు, విద్యార్థులకు డిస్కౌంట్లు, మహిళలకు స్పెషల్ బస్సులు, టి-24 టికెట్ ఇలా వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్నారు. కరోనా వల్ల నష్టాలు మూటగట్టుకున్న తెలంగాణ ఆర్టీసీ.. సజ్జనార్ ఎంట్రీతో లాభాల బాటలో నడుస్తోంది. మరోవైపు బస్టాండ్లు, ఆర్టీసీ సిబ్బందికి సదుపాయాలు, బస్టాండ్లలో వసతులు ఇలా అన్ని రకాలుగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నారు.