తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Revenue: నిరుటి కంటే పెరిగిన పన్నుల రాబడి

Telangana Revenue: రాష్ట్ర పన్నుల రాబడి జనవరి నెలాఖరు వరకు 80శాతం అంచనాలను చేరుకొంది. నిరుడు జనవరి వరకు 60శాతం అంచనాలు అందుకోగా... ఈసారి 20శాతం పెరిగింది. అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను అంచనాలు 8‌0 శాతాన్ని అధిగమించాయి. పన్నేతర రాబడి, గ్రాంట్లు మాత్రం అంచనాలను 20శాతం లోపే అందుకున్నాయి. రుణాల లక్ష్యం మాత్రం 97శాతం దాటాయి. మాత్రం జనవరి నెల ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షా 37 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది.

Telangana
Telangana

By

Published : Mar 3, 2022, 5:20 AM IST

Telangana Revenue: గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్​కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తోంది. జనవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా 98 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 55 శాతం. పన్ను ఆదాయంలో మాత్రం లక్ష్యాన్ని 80 శాతం చేరుకొంది. గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలఖారు వరకు పన్ను ఆదాయం అంచనాలను 60 శాతం మాత్రమే చేరుకొంది. పన్నుల ద్వారా రూ. లక్షా ఆరు వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేయగా జనవరి నెలాఖరు వరకు 85 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.

20శాతం లోపే...

జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా 10,881 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. జీఎస్టీ ద్వారా రూ. 27,348 కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 9,637 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ. 22,285 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ. 14,447 కోట్లు, కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాగా 7,589 కోట్ల రూపాయలు సమకూరాయి. అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను, కేంద్ర పన్నుల్లో వాటాకు సంబంధించి బడ్జెట్ అంచనాల్లో 80 శాతానికి పైగా చేరుకున్నాయి. జీఎస్టీ, స్టాంపులు- రిజిస్ట్రేషన్లు 70 శాతానికిపైగా అంచనాలను అందుకున్నాయి. పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు మాత్రం 20 శాతం లోపే ఉన్నాయి.

రెవెన్యూ వ్యయం...

పన్నేతర ఆదాయాన్ని 30,557 కోట్ల రూపాయలు అంచనా వేయగా... 5,600 కోట్లు మాత్రమే సమకూరాయి. కేంద్రం నుంచి 38 వేల కోట్లకు పైగా గ్రాంట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేయగా... జనవరి నెలాఖరు వరకు కేవలం రూ. 7,303 కోట్లు మాత్రమే వచ్చాయి. అప్పుల విషయంలో మాత్రం జనవరి నెలాఖరు వరకే అంచనాలు 97 శాతాన్ని అధిగమించాయి. 45,509 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవాలని ప్రతిపాదించగా... అందులో జనవరి నెలాఖరు వరకే 44,406 కోట్లు అప్పుగా తీసుకున్నారు. జనవరి నెలాఖరు వరకు పది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం లక్షా 37 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. అందులో రెవెన్యూ వ్యయం లక్షా 13 వేల కోట్లు కాగా... మూలధన వ్యయం 24 వేల కోట్లకు పైగా ఉంది.

ఇదీ చదవండి:ప్రైవేటు ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ టీచర్లకు హైకోర్టు షాక్


ABOUT THE AUTHOR

...view details