Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు వర్షాలు లేక వేసవి కంటే ముందే భానుడి ప్రభావం అధికంగా ఉండడంతో అడుగంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్టుకు దిగువన సాగునీటి, తాగునీటి అవసరాలకు రానున్న వేసవిలో తీవ్ర ఇబ్బంది ఏర్పడనుంది. అయితే వెంటనే జల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖలో కోరారు.
కృష్ణా జలాల్లో ఇప్పుటికే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగించుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కేటాయింపుల ప్రకారం చూస్తే ఆంధ్రాకు 615.17 టీఎంసీలు, తెలంగాణకు 316.90 టీఎంసీల వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. గత నెల 25వ తేదీకి ఏపీ 542.45 టీఎంసీలు వినియోగించుకోగా.. ఇంకా 59.68 టీఎంసీలు ఇంకా వాడుకోవడానికి ఉన్నాయన్నారు. అదే తెలంగాణ 183.05 టీఎంసీల నీటిని వినియోగించుకోగా.. ఇంకా 10.20 టీఎంసీల నీరు వాడుకోవడానికి ఉందన్నారు. అయితే తెలంగాణకు 123.63 టీఎంసీలు.. ఏపీకి 13.03 టీఎంసీలు కృష్ణా ప్రాజెక్టులో మిగులు ఉందని ఆలేఖలో తెలిపారు.
KRMB Three member committee Meeting today: రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలకు అనుగుణగా కృష్ణా నీటిని పంపిణీ చేసేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ నారాయణరెడ్డి కమిటీలో సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశం హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు కార్యాలయంలో జరగనుంది.