లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు చేసింది. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించుకోగలిగారు. నత్తనడకన నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. అవి వేగంగా పూర్తై ఉత్పత్తి ప్రారంభించే వరకు వెంటపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల వరకు తీవ్రమైన విద్యుత్ కోతలుండేవి. రాష్ట్రం ఏర్పడ్డ ఆరో నెల నుంచి కోతల్లేని విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నారు. గృహా అవసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల త్రీఫేజ్ కరెంటు అందిస్తున్నారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రంలో విద్యుత్ కోతలుండకుండా ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణలో దాదాపు 28 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తుంది. 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యమని సీఎం కేసీఆర్ తెలిపారు.
సరిపడా విద్యుత్ లేక..
రాష్ట్రంలో భూగర్బ జలాలు ఉన్నప్పటికీ.. సరిపడా విద్యుత్ లేకపోవడం వల్ల వినియోగించుకోలేని పరిస్థితి ఉండేది. 2018 జనవరి 1 నుంచి ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు అందిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 24.16 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్రంలోని 30 శాతం కరెంటు ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తున్నారు. 2014లో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా.. ఫిబ్రవరి 2020 నాటికి వందశాతానికి పైగా పెరిగి 15,980 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. ఇందులో 3,681 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉంది. రూ.27.77 వేల కోట్ల వ్యవయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది.
దినదినాభివృద్ది..
ఈ నిధులతో సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్తలైన్ల నిర్మాణం చేపట్టింది. విద్యుత్తు రంగం గడిచిన నాలుగేళ్లలో దినదినాభివృద్ది సాధించింది. 2014 జూన్ నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే.. 2020 మే నాటికి 15,980 మెగావాట్ల సామర్థ్యం సాధించింది. 2014లో గరిష్ట డిమాండ్ 5,661 మెగావాట్లుంటే.. 2020 నాటికి 13,168 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. గరిష్ట వినియోగం 228 మిలియన్ యూనిట్ల నుంచి 255 మిలియన్ యూనిట్లకు పెరిగింది. 400 కేవీ సబ్స్టేషన్లు 6 నుంచి 21కి పెరిగాయి. 220 కేవీ సబ్స్టేషన్లు 51 నుంచి 91కి పెరిగాయి. 132 కేవీ సబ్స్టేషన్లు 176 నుంచి 238కి పెరిగాయి. ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు 233 నుంచి 350కి పెరిగాయి. మొత్తం డిస్కం లైన్ల పొడవు 4,40,229 కిలోమీటర్లు ఉంటే గడిచిన ఆరేళ్లలో 5,67,622 కిలోమీటర్లకు పెంచారు. వ్యవసాయ కనెక్షన్లు రాష్ట్ర ఆవిర్భావం నాటికి 19,02,754 ఉంటే. ప్రస్తుతం 24,48,000కి పెరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం నాటికి మొత్తం కనెక్షన్లు 1,11,19,990 ఉండగా ఇప్పుడు 1,55,00,000కి పెరిగాయి.