తెలంగాణ విద్యుత్ రంగం మరో రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోజువారీ విద్యుత్ డిమాండు శుక్రవారం 13,168 మెగావాట్లు నమోదైంది. అలాగే చరిత్రలో ఎన్నడూ లేనంతగా తలసరి విద్యుత్ వినియోగం నమోదవడం మరో రికార్డు అని ట్రాన్స్‌కో వెల్లడించింది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండు ఏర్పడినా కోత, లోటు లేకుండా సరఫరా చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు.
34శాతం అధికం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2014 మార్చి 23న గరిష్ఠ డిమాండ్ 13,162 మెగావాట్లుగా నమోదవగా ఇప్పుడు తెలంగాణలోనే 13,168 మెగావాట్లకు చేరింది. గత ఏడాది ఇదేరోజు (ఫిబ్రవరి 28న) తెలంగాణలో గరిష్ఠ డిమాండ్ 9,770 నమోదవగా ఈ ఏడాది అంతకన్నా 34 శాతం అధికంగా ఉంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, భారీగా ఎత్తిపోతల పథకాల నిర్వహణ, పరిశ్రమల సంఖ్య పెరగడం తదితర కారణాల వల్ల గరిష్ఠ డిమాండ్ గత ఆరేళ్లలో 132.6 శాతం అదనంగా పెరిగింది.
తలసరి వినియోగం అధికం..
తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వార్షిక విద్యుత్తు వినియోగం 47,338 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా 2018-19లో 44 శాతం అదనంగా పెరిగింది. ఇదే సమయంలో దేశ సగటు పెరుగుదల 23 శాతం మాత్రమేనని ప్రభాకరరావు వివరించారు. విశ్వవ్యాప్తంగా ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ అంశంలో తెలంగాణ జాతీయ సగటును మించింది. జాతీయ తలసరి సగటు విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణలో 1,896 యూనిట్లు ఉంది.