National Panchayat awards 2023: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2023 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఎంపికైన గ్రామ పంచాయతీలకు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు 46 అవార్డులు ప్రకటించగా.. అందులో తెలంగాణకు ఏకంగా 13 అవార్డులు లభించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకల్లా అగ్రస్థానంలో మన రాష్ట్రం నిలిచింది.
రాష్ట్రానికి 8 అవార్డులు:దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 27 అవార్డులు ప్రకటిస్తే.. అందులో ఏకంగా 8 అవార్డులు రాష్ట్రానికి దక్కడం విశేషం. మొత్తం 9 కేటగిరీలు ఉండగా అందులో 4 విభాగాల్లో రాష్ట్రానికే మొదటి స్థానం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్, జనగాం జిల్లా నెల్లుట్ల, మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్‌పల్లి.. సూర్యాపేట జిల్లా ఐపూర్, జోగులాంబ గద్వాల జిల్లా మాన్‌దొడ్డి, వికారాబాద్ జిల్లా చీమల్‌దర్రి పంచాయతీలు అవార్డులు దక్కించుకున్నాయి.
అలాగే పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్, రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా-కే, రంగారెడ్డి జిల్లా కన్హాతో పాటు మరికొన్ని గ్రామాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి చేతుల మీదుగా సర్పంచ్‌లు, కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. మంత్రి ఎర్రబెల్లితో కలిసి వీరంతా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ములుగు జిల్లాకు నానాజీ దేశముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కారంలో రెండో స్థానంలో నిలిచింది.
ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో: ఇందుకు గానూ జిల్లా ప్రతినిధులు రూ.3 కోట్ల నగదుతో పాటు పురస్కారం అందుకున్నారు. ముఖ్యమంత్రి దిశా నిర్దేశంతో తెలంగాణలో పల్లెలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. కేంద్రంతో సమానంగా అంతే మొత్తంలో నిధులిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.