Telangana Ration Cards Issue : తెలంగాణలో కొత్తరేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు 9.88 లక్షల కార్డుదారులు రేషన్ తీసుకోవడం లేదని పౌరసరఫరాల సంస్థ గుర్తించింది. కనిష్ఠంగా 11 శాతం మంది రేషన్ తీసుకోవట్లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడైంది. వీరి కార్డులను కొనసాగించాలా? లేదా? అన్న విషయాన్ని సీఎం, కేబినేట్ దృష్టికి తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మొత్తం 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జారీ చేసిన ఆహార భద్రత కార్డులు 54.39 లక్షలు కాగా, వీటి పరిధిలో 1.94 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి తెలిపింది. రాష్ట్ర సర్కార్ జారీ చేసిన ఆహార భద్రత కార్డులు 35.59 లక్షలని పేర్కొంది. ఇందులో లబ్ధిదారుల సంఖ్య 91.30 లక్షలు. రాష్ట్ర జనాభా 3.95 కోట్లు కాగా వీరిలో 2.85 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నట్లు వివరించింది.
తెలంగాణలోని 71.47 శాతం మంది ప్రజలు ఆహార భద్రత కార్డుల పరిధిలో ఉన్నారని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించింది. మరోవైపు ఆరోగ్యశ్రీ, పలు సంక్షేమ పథకాలకు ఆహార భద్రత కార్డు (Telangana Ration Card) ఉండాలన్న నిబంధన కారణంగా ఆర్థికంగా బలంగా ఉన్న చాలామంది ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నారు. వీరే రేషన్ తీసుకోవడం లేదని సమీక్షలో తేలింది.