తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చిన రాజకీయ పార్టీ. అంతకు ముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు తెరాస అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగురవేశారు.
ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది తెరాస. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత తెరాస రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్తో పాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది.
మొదటి ముఖ్యమంత్రిగా..
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవ తెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు.