TRS becomes as BRS: టీఆర్ఎస్ ఇవాళ భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించనుంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్గా పేరుతో జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని కోరుతూ, దసరా రోజున ముహూర్తం ప్రకారం ఒంటి గంట 19 నిమిషాలకు పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. అక్టోబరు 5న ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాశారు.
TRS to BRS : నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ 30రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాల గడువు ముగియడంతో, బీఆర్ఎస్గా పేరు మార్చాలన్న టీఆర్ఎస్ వినతిని ఎన్నికల కమిషన్ ఆమోదించింది. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ పంపించింది. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ఈసీ పంపించిన లేఖకు పంపించే కేసీఆర్ సంతకం చేసి.. ఆవిర్భావాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
TRS Emerges as BRS : అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట్రంతో కూడిన గులాబీ జెండా టీఆర్ఎస్ను ఇప్పటి వరకూ వినియోగిస్తుండగా, కొద్దిమార్పులతో బీఆర్ఎస్ జెండాను రూపొందించారు. గులాబీ రంగుపై భారతదేశం పటంతో బీఆర్ఎస్ జెండా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పేరు మాత్రమే మారినందున.. కారు గుర్తు యథాతథంగా కొనసాగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలందరూ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరయ్యేందుకు... తెలంగాణ భవన్‌కు రావాలని కేసీఆర్ సూచించారు. జాతీయ ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్.. బీఆర్ఎస్కు పురుడు పోశారు.