ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. 2020-21 ఖరీఫ్ సీజన్‌లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20 ఖరీఫ్ పంట కాలంలో 111.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి సేకరించినట్లు కేంద్రం వెల్లడించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆకలి దప్పుల తెలంగాణ అన్నపూర్ణగా మారడానికి ఏడేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. సాగు నీటి కల్పన, ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతన్నలకు అండగా నిలవడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తు చేశారు. ఏటా రూ.25 వేల కోట్లు సాగు నీటి ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ వంటి పథకాల అమలు కోసం ప్రభుత్వం దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రం మారాలంటే.. 60 శాతం మంది ఆధారపడిన కీలక వ్యవసాయ రంగం బలపడాలన్న సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని వివరించారు.