Raj Bhavan On TSRTC Merging bill : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్లును రాజ్‌భవన్ పెండింగ్‌లోనే ఉంచింది. బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బిల్లుపై న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్‌భవన్ పేర్కొంది.ఆర్టీసీఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వని పక్షంలో రాజ్ భవన్ వివరణ ఇచ్చింది.
ఈ మేరకు గవర్నర్ ప్రెస్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండో తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాజ్ భవన్‌కు బిల్లు చేరిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని, న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ స్పష్టం చేసింది.
Governor Tamilisai on TSRTC Bill : ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ వద్దకు పంపించారు. రాష్ట్ర కేబినేట్ రూపొందించిన బిల్లును యుద్ధ ప్రాతిపదికన రెండు రోజుల క్రితమే ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపింది. అయితే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం లభించలేదు. ఒక వేళ తమిళిసై అనుమతి లభిస్తే ఇతర బిల్లులతో పాటు ఈ బిల్లు కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ముందుగా భావించింది. గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతి రాకపోవడంతో ఎజెండాలో పొందుపరచలేదు.
Telangana RTC Merging bill : అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగిస్తుండటంతో ఇప్పటి వరకు ఈ బిల్లుపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఇప్పటికే బిల్లు పంపి రెండు రోజులైనా అనుమతి ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం, కార్మికులను ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశంతోనే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా ఉన్నారని అంటున్నారు.
ఆర్టీసీ చరిత్ర తెలుసా..:మన దేశంలోనే మొదటిసారిగా 1932లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. 166 మంది కార్మికులు, 27 బస్సులతో ప్రారంభమైన సంస్థను నవంబర్ 1, 1951లో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేశారు. తెలగు రాష్ట్రాల విభజన రాష్ట్ర విభజన అనంతరం.. 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం... 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా మార్చారు. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల 373 మంది కార్మికులు ఉన్నారు.
ఇవీ చదవండి: