Trains Cancelled Due to Rains In Telangana : రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలతో రైలు పట్టాలపైకి, రైల్వే స్టేషన్లలోకి వరద నీరు వస్తోంది. ఈ ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 5 రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. అదేవిధంగా మరో 40 రైళ్లను దారి మళ్లించి నడిపించారు. ప్రధానంగా గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు గంటల తరబడి రైల్వేస్టేషన్లలోనే నిలిచిపోయాయి.
Trains Route Diverted due to Rains : పెద్దపల్లి స్టేషన్‌లో గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌ను గురువారం మధ్యాహ్నం 6 గంటలపాటు నిలిపేశారు. ఈ క్రమంలో పట్టణంలోని పలు సేవా సంస్థలు రైలులోని ప్రయాణికులకు అల్పాహారం అందించాయి. హనుమకొండ జిల్లా వడ్డేపల్లి వద్ద రైలు పట్టాల వరకు వరద వచ్చింది. అలాగే కోమటిపల్లి రైల్వే గేటు వద్ద పట్టాల మీదుగా ప్రవాహం పారింది. హసన్‌పర్తి-కాజీపేట మధ్య వరదనీరు ప్రమాదకరస్థాయిలో ట్రాక్ పైనుంచి పొంగి పొర్లింది.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దురంతోల దారి మళ్లింపు :భారీ వానల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. వాటిలో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను 27, 28 తేదీల్లో, సికింద్రాబాద్-కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీని 27వ తేదీకి, సికింద్రాబాద్‌కి వచ్చి వెళ్లే బీదర్ ఇంటర్‌సిటీని 27, 28 తేదీల్లో ద.మ.రైల్వే రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను బల్లార్ష నుంచి మంచిర్యాల, కాజీపేట వైపు కాకుండా దారి మళ్లించారు. మజ్రి, పింపల్‌కుట్టి మార్గంలో సికింద్రాబాద్‌కు చేరుకుంది. సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన దానాపుర్ ఎక్స్‌ప్రెస్‌ని కాజీపేట నుంచి విజయవాడ, దువ్వాడ, విజయనగరం, సంబల్‌పుర్ మీదుగా మళ్లించి నడిపించారు. తిరువనంతపురం-దిల్లీ ఎక్స్‌ప్రెస్‌ని విజయవాడ నుంచి వరంగల్ వైపు కాకుండా దువ్వాడ, విజయనగరం, రాయగడ, రాయ్‌పుర్ నాగ్‌పుర్ వైపు మళ్లించారు.