Telangana Rain Alert Today :వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని మండలాల్లో వానలు కురిశాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కన్నాయిగూడెంలో అత్యధకంగా 98.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. పెంకవాగు పొంగి ప్రవహిస్తుండడంతో.. కొత్త గుంపు, కలిపాక, పెంకవాగు, తిప్పాపురం గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి.
Heavy Rain Alert To Telangana : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలతో.. ప్రాణహిత, గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షాలు, ఎగువ నుంచి వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 19 అడుగులకు నీటిమట్టం చేరింది. వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
Rains in Telangana 2023 : వరణుడి కరుణతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పనులు జోరందుకునే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఖమ్మం జిల్లాల్లో చెరువులు, వాగులు జలకళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో మూడు రోజుల పాటు అతి నుంచి అత్యంతభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, షీయర్ జోన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.