పోటెత్తున్న ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి Godavari Water Level at bhadrachalam : గోదావరికి వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద మరింత అంతకంతకూ గోదావరి నీటిమట్టం పెరిగిపోతోంది. ఓవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇవాళ ఉదయం 8 గంటల వరకు 50.5 అడుగులకు చేరింది. బుధవారం నుంచి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
మరోవైపు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి వరద చేరిక కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 88,886 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1087 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 73.227టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి వరద నీటి రాక ఇలాగే కొనసాగితే గేట్లు ఎత్తి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు.
Telangana projects water Levels : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు మత్తడి దూకుతోంది. ఎల్లంపల్లి, మానేరు నుంచి వచ్చే వరదతోపాటు ప్రాణహిత నుంచి వచ్చే భారీ వరదతో కలిపి మేడిగడ్డ బ్యారేజీలో 75 గేట్లు ఎత్తి 5లక్షల 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇంద్రావతి నుంచి వచ్చే వరదతోపాటు స్థానికంగా కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలతో తాలిపేరు నుంచి లక్షా 98వేల క్యూసెక్కులు గోదావరిలోకి చేరుతోంది. భద్రాచలం వద్ద ప్రవాహం బుధవారం రాత్రి 11లక్షల 28వేల క్యూసెక్కులకు మించి నమోదైంది. నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
Krishna river floods : కృష్ణా బేసిన్‌లో ఆలమట్టికి ప్రవాహంనిలకడగా ఉంది. 1.38లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా తుంగభద్రకు 98 వేల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో ఎగువ, దిగువ విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేయిస్తున్నారు. ఎగువన 4.669 మిలియన్ యూనిట్లు, దిగువ కేంద్రంలో 5.681 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. రెండు కేంద్రాల ద్వారా 29,641 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Musi project Floods 2023 : ఖమ్మంలోని పాలేరు జలాశయం పొంగి ప్రవహిస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుతం 24 అడుగుల మేర ప్రవహిస్తుంది. 24 గేట్లు ఎత్తి సుమారు 10 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్, గండి పేట జలాశయం గేట్లు తెరవడంతో మూసీలోకి వరద పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు.
స్వర్ణ జలాశయంలో వరద ఉద్ధృతి : నిర్మల్ జిల్లాలోని స్వర్ణ జలాశయంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1181 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 36,000 క్యూసెక్కులు వస్తుండగా..4 గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 1,53,583 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్‌ఫ్లో 1,67,611 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 15.4788 టీఎంసీల నీటి మట్టం ఉంది. 20 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల చేస్తున్నారు.
ఇవీ చదవండి: