Telangana Rains Toady : ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండురోజులుగా కురుస్తు..న్న మోస్తరు నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు జలకళ సంతరించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారి నీటమునిగింది. మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిచండతో లోలెవల్ వంతెనపై నుంచి నీరు పారుతోంది. ముందు జాగ్రత్తగా పోలీసులు రాకపోకలను నిలిపివేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు.. ఎగువన చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు21 గేట్లు ఎత్తి 60,000 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 38 అడుగుల దాటి ప్రవహిస్తోంది. కాళేశ్వరం, ఇంద్రావతి, ప్రాణహిత, తాలిపేరు నుంచి వస్తున్న ప్రవాహంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.
Rains in Telangana 2023 : భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతం, దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద.. గోదావరి నది ప్రవాహం ఉద్ధృతంగా పెరుగుతోంది. సీతమ్మ నార చీరల ప్రాంతం వరదలో చిక్కుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున.. లోతట్టు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కోరారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సమీక్ష అనంతరం భద్రాచలం కరకట్ట వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెంలో వర్షానికి నానిన ఇల్లు కూలిపోయింది. ఇంట్లోని వారంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరగడంతో.. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. ఏకధాటి వర్షాలతో రామగుండం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బురద పేరుకుపోయి భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. 70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.