Nizamsagar Project water Level : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయంలోకి వరద నీరు పెరుగుతోంది. ఎగువ నుంచి 45,000 క్యూసెక్కుల నీరు రావడంతో.. ఆరు గేట్లు ఎత్తి 45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1404.66 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి.. 2454 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ కర్ణాటక నుంచి 2454 క్యూసెక్కుల నీరు వస్తోంది.
Sriramsagar Project Latest News :నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని.. 18 గేట్లను ఎత్తి 58,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1089.2 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతానికి 80.65 టీఎంసీల నీరు ఉంది. ముఖ్యమంత్రి ఆదేశంతో అధికార యంత్రాంగంతో కలిసి మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎస్సారెస్పీని సందర్శించారు.
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 685 అడుగులుగా ఉంది. ఎగువనుంచి 17,045 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. 10 గేట్ల ద్వారా 34,752 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రమాదకంగా మారిందన్న సమాచారంతో.. కేంద్ర, రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం సభ్యులు పరిశీలించారు. భారీ వరద వస్తున్నందున భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న బృందం.. ఇందుకు సంబంధించి తగు సిఫార్సులు చేస్తామని పేర్కొంది. వరదలకు గేట్లలో ఎదురైన సమస్యలు, కోతకు గురైన ప్రాంతాలను కూడా ఈ బృందాలు పరిశీలించాయి.
Telangana Rains : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తగా.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వద్ద గోదావరినది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రామగుండం లారీయార్డు, సమ్మక్క సారలమ్మ స్మశాన వాటిక, సప్తగిరి కాలనీ, మల్కాపూర్ గ్రామాలు నీటమునిగాయి. కరీంనగర్ దిగువ మానేరు జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. మోయతుమ్మెద వరదతోలోయర్ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 22 టీఎంసీల నీరుంది. 16 గేట్లు ఎత్తి.. 56,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో ఉన్నందున వరద తాకిడికి నిర్మాణాలు దెబ్బతినకుండా అధికారుల చర్యలు చేపట్టారు.