Telangana Prajavani Program : ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజావాణికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వారి వినతులను పరిశీలిస్తున్నారు. కిలోమీటరు దూరం వరకు బారులు తీరిన అర్జీదారులు, తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేశారు.
Huge Complaint to Prajavani Program :పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు, రవాణా రంగంలో బిల్లులు తగ్గించాలనే వినతులతో పెద్దఎత్తున జనాలు రావడంతో ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలను క్రమబద్దీకరించిన పోలీసులు అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధిక శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్ వల్ల తమ భూములు పోయాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భూములు ఖబ్జా చేశారని, టీఎస్పీఎస్సీపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నవే ఉన్నట్లు సమాచారం.
ప్రజావాణికి ఊహించని స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు
గత ప్రభుత్వం పరిష్కారం చూపని ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వమైనా పరిష్కరిస్తుందన్న నమ్మకంతో వినతి పత్రాలతో ప్రజావాణికి వస్తున్నామని అర్జీదారులు చెబుతున్నారు. చాలా ఏళ్లుగా స్పౌజ్ బదీలలపై ఉద్యోగులు అనేక ధర్నాలు, ర్యాలీలు చేపట్టినా సమస్య తీరకపోవడంతో ప్రజావాణికి వచ్చామని తెలిపారు. ఈ సర్కారైనా తమ సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.