తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల పంపకాలకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన తుది ఆదేశాలపై సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అధ్యక్షతన సోమవారం సంబంధిత కమిటీ ఆదేశాలపై సమీక్ష నిర్వహించారు
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాలరావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ స్థానికత లేని 586 మంది ఉద్యోగులను ఏపీ నుంచి రాష్ట్రానికి కేటాయిస్తూ కమిటీ తాజాగా ఆదేశాలిచ్చింది. అయితే, వారిని ఇక్కడ చేర్చుకోకూడదని సీఎండీలు నిర్ణయించారు.
తెలంగాణ స్థానికత లేకుండా ఆయా ఉద్యోగులను రాష్ట్రానికి కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారు. మరోవైపు కరోనా కట్టడికి అన్ని విద్యుత్ కార్యాలయాల్లో పక్కాగా శానిటైజేషన్ నిర్వహించాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగుల్లో ఎవరికైనా వైరస్ సోకితే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేందుకు వీలుగా నోడల్ అధికారిని కూడా నియమించారు.