Telangana Political Parties Focus on Election Campaign : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Election 2023) రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు హోరాహోరిగా తలపడుతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు సాగిస్తున్నారు. తొమ్మిదినరేళ్ల పాలనలో ప్రగతిని వివరిస్తూ బీఆర్ఎస్ నేతలు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సంక్షేమ పాలనతో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్ గడప, గడపకూ తిరుగుతోంది. బలహీన వర్గాలను అందలం ఎక్కిస్తామంటూ బీజేపీ జనాల్లోకి వెళ్తోంది.
BRS Election Campaign Telangana 2023 :తెలంగాణలో తొలి రెండు సార్లు అధికారం ఛేజిక్కించుకున్న బీఆర్ఎస్(BRS) మరోమారు గెలిచేందుకు చతురంగ బలాలను వినియోగిస్తోంది. కేసీఆర్ భరోసా(KCR Bharosa) పేరుతో కొత్త హామీలను జనాల్లోకి తీసుకెళ్తూ గులాబీ నేతలు ఓట్లు అడుగుతున్నారు. హైదరాబాద్, సనత్‌నగర్ డివిజన్లో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు వివరించారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మత్స్యకారులు వలలతో స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో హన్మంత్ షిండే ప్రచారం వినూత్నంగా సాగింది. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెద్దగుల్ల గ్రామంలో స్థానిక నేత గుర్రంపై కూర్చోని ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కి ఘన స్వాగతాలు లభించాయి.
హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో పాడి కౌశిక్‌రెడ్డి, ఆయన భార్య శాలిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిపారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి భార్య సునీత ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఆశీర్వదించమని కోరారు.
Telangana BJP Election Campaign : అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం వ్యూహాలు.. రూట్ మ్యాప్ సిద్ధం
Telangana Congress Election Campaign 2023 : ఆరు గ్యారెంటీల(Congress Six Guarantees)ను ప్రచారాస్త్రాలుగా మలుచుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా పుంజుకోవటంతో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వం బీసీ జాబితాలో తొలగించిన 27 కులాల సంఘం నేతలు హైదరాబాద్ కూకట్‌పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్‌కు మద్దతు పలికారు. మలక్‌పేట అభ్యర్థి షేక్ అక్బర్ ప్రచారంలో భాగంగా మాంసం దుకాణంలో మటన్ కొట్టి ఓటర్లను ఆకర్షించారు. కామారెడ్డి జిల్లా హన్మాజిపేట్ గ్రామంలో ఏనుగు రవీందర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.