Telangana Political Leaders Casted Vote 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రముఖులంతా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడ బర్కత్‌పురా దీక్ష మోడల్ స్కూల్లో తన కుటుంబంతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Telangana MPs Casted Vote in Telangana : మరోవైపు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బాన్సువాడ మండలంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో .. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జ్యోతినగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కుటుంబసమేతంగా వచ్చి ఓటు వేశారు. ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ సొసైటీ కమ్యూనిటీ హాలులో ఉన్న పోలింగ్ బూత్ నంబర్ తొమ్మిదిలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆయన సతీమణి ఉమా కుమారుడు రాహుల్ కుమార్తె శృతి లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
KTR Casted Vote in Hyderabad :బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లో తన భార్యతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఓ పౌరుడిగా తన బాధ్యత నిర్వహించానని.. విద్యావంతులంతా వారి బాధ్యతను తప్పకుండా నిర్వర్తించాలని కోరారు. అభివృద్ధికి బాటలు వేసే నాయకులకే తాను ఓటు వేశానని తెలిపారు. సిద్దిపేట భారత్‌నగర్ అంబిటస్ స్కూల్లో మంత్రి హరీశ్‌రావు సతీసమేతంగా ఓటు వేశారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల తంటాలు - పోటాపోటీగా డబ్బు పంపిణీ చేస్తున్న అభ్యర్థులు