పోస్టుల్లో ఏవైనా వివాదాస్పద అంశాలుంటే వడబోసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే పోలీస్‌శాఖ వినియోగిస్తోంది. తొలినాళ్లలో సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఈ పరిజ్ఞానంతో నిఘా ఉంచేవారు. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారానే తమ భావజాలాన్ని విస్తరింపజేయడంతో సానుభూతిపరుల కదలికల్ని పసిగట్టేందుకు ఈ నిఘా అక్కరకొచ్చేది.
ఉగ్రవాద సంస్థలు తరచూ వినియోగించే పదజాలంతోపాటు రహస్య సంకేత పదాలు సామాజిక మాధ్యమ ఖాతాల్లో కనిపిస్తే ఇట్టే పట్టేసే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఐసిఎస్’, ‘ఇరాక్-సిరియా’ ‘అబూబకర్’.. తదితర పదాలను ఈ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఓపెన్‌గా చాట్ చేసే ఖాతాలో ఈ పదాలు కనిపిస్తే వెంటనే సాఫ్ట్‌వేర్ ఆ ఖాతాను గుర్తించేది. ఆ ఖాతాదారు సాగించే సంభాషణల పూర్తిసారాన్ని తెరపై సాక్షాత్కరింపజేసేది. ఒకవేళ ఉగ్రవాదం దిశగా ప్రేరేపించే సంభాషణలున్నట్లు గుర్తిస్తే ఈ ప్రక్రియను పరిశీలించే సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేసేవారు. ఈక్రమంలో సామాజిక మాధ్యమ ఖాతాల వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా, కేవలం చట్ట వ్యతిరేక వ్యవహారాలపై మాత్రమే నిఘా అమలు చేసేవారు. కొంతకాలంగా సున్నితమైన అంశాలకు సంబంధించి అభ్యంతరకర పోస్టులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా పెరిగిపోవడంతో అలాంటి అంశాలపైనా ఓ కన్నేసి ఉంచుతున్నారు. తాజాగా బెంగళూరు అల్లర్ల ఉదంతంతో తెలంగాణ పోలీసులు ఈ నిఘాను మరింత విస్తృతం చేశారు.