- రాచకొండ కమిషనరేట్ పరిధిలో హత్య జరిగింది. దర్యాప్తులో భాగంగా సంబంధిత అధికారి హత్యాస్థలానికి, పోస్టుమార్టం నివేదిక కోసం ఉస్మానియా ఆసుపత్రితో పాటు అనేక ప్రాంతాలకు తిరగాల్సి వచ్చింది. ఇది జరిగిన నాలుగు రోజులకు సంబంధిత అధికారికి జ్వరం వచ్చింది. పరీక్ష చేయించుకోగా కరోనా నిర్ధారణ అయింది.
- హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీ కేసులో నిందితుణ్ని పట్టుకున్నారు. రిమాండుకు తరలించడంలో భాగంగా నిబంధనల ప్రకారం కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్ష నిర్వహించేందుకు అతన్ని పోలీసు సిబ్బంది తీసుకెళ్లారు. తర్వాత వారికి కొవిడ్ సోకింది.
ఇలా ఇప్పటి వరకూ దాదాపు వెయ్యి మంది సిబ్బంది కొవిడ్ కోరల్లో చిక్కారు. పోలీసు పని అంటేనే జనంతో మమేకం కావడం. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడంలేదని సిబ్బంది వాపోతున్నారు. ఒకవేళ కరోనా సోకితే మెరుగైన చికిత్స అందించాలని, ఇందుకోసం దీన్ని కూడా పోలీసు సిబ్బంది వైద్య చికిత్సల కోసం ఉద్దేశించిన ఆరోగ్య భద్రత పరిధిలోకి తేవాలని వారు కోరుతున్నారు. తద్వారా ఒకవేళ కొవిడ్ సోకినా మెరుగైన చికిత్స అందుతుందనే భరోసా కలుగుతుందని వారు చెబుతున్నారు.