Podu Pattas Distribution Telangana :రాష్ట్ర సర్కార్ ఎన్నో ఏళ్ల గిరిజనుల గోసకు నేడు చెక్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిపుత్రులకు పోడు పట్టాలపంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 15వేల మందికి పైగా పోడు రైతులకు.. నాలుగు లక్షల ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ అందజేస్తోంది. అడవి బిడ్డల అభ్యున్నతిలోనే నేడు ఓ సువర్ణ అధ్యాయమని.. గిరిపుత్రులకు యజమానులుగా చేస్తున్న చారిత్రక సందర్భం అంటూ పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ట్విటర్ వేదికగా పోస్టు పెట్టారు.
KTR Tweet on Podu Pattas Distribution :నీళ్లు, నిధులు.. నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాకుండా.. జల్.. జంగల్.. జమీన్.. అనే కుమురం భీం కలలను కూడా.. అక్షరాలా సాకారం చేసిన.. ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మొన్న కొండకోనల్లోని నివాసాలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన "జల్" అందించామని.. నిన్న కంటికి రెప్పలా అడవులను కాపాడటంతో.. రాష్ట్రంలో 7.70 శాతం "జంగల్" పెరిగిందని.. నేడు 1.51 లక్షల మందికి.. ఏకంగా 4.60 లక్షల ఎకరాల "జమీన్" పై హక్కును కల్పిస్తూ పట్టాలు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
'మావ నాటే - మావ రాజ్' స్వప్నం గ్రామ పంచాయతీల ఏర్పాటుతో సాకారమైందని కేటీఆర్ తెలిపారు. మరోవైపు పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆకాశాన్నంటే ఆత్మ విశ్వాసం పెరిగిందని చెప్పారు. ఇలా ఒకటా, రెండా.. పోడు భూముల గోడు తీర్చి.. గిరిజన - ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి.. పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిదని పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అభివర్ణించారు. అడవి బిడ్డల అభ్యున్నతిలోనే ఓ సువర్ణ అధ్యాయమని కేటీఆర్ ట్వీట్ చేశారు.