తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ పీసీసీ అధ్యక్షపదవి ఎవరిని వరించునో..! - Telangana PCC chief Latest Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతుండటం వల్ల కొత్త అధ్యక్షుడి ఎంపిక కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. జనవరి నెలాఖరుకు అధ్యక్షుడి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ సీనియర్లు కొందరు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాతే అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాలన్న వాదన కూడా పార్టీలో వ్యక్తమవుతోంది.

Telangana PCC president chief election 2020
తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక?

By

Published : Jan 18, 2020, 5:00 AM IST

Updated : Jan 18, 2020, 8:42 AM IST

తెలంగాణలో పురపాలక ఎన్నికల హడావుడి కొనసాగుతుండగానే టీపీసీసీ అధ్యక్ష ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల క్రితం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్టీ శ్రేణుల్లో ఆత్రుత మొదలైంది. పార్టీ కొత్త సారథి ఎవరు అన్న వాదన పార్టీలో చర్చ జరుగుతోంది. మున్సిపల్‌ ఎన్నికల నోటిషికేషన్‌కు ముందే పీసీసీ అధ్యక్షుడి కోసం ఆశావహులు అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొంత మంది ఇక్కడి నుంచే దిల్లీలో తమకున్న పరిచయాల ద్వారా లాబీయింగ్‌ సైతం చేయిస్తున్నారు. మరికొందరు దిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలిసి తమ వాదనలను వినిపించి వచ్చారు. ఇలా ఎవరికి వారు తమ పరిచయాల ద్వారా పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధాన నేతల మధ్య పోటీ...
ప్రధానంగా భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, మధుయాస్కీ, సంపత్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిలతోపాటు మరికొందరు నేతలు రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరివైపు పార్టీ సుముఖత చూపినా వారికున్న ఆర్థిక పరిస్థితులు కారణంగా ఆ పదవిని తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తెరాసను దీటుగా ఎదుర్కొని కాంగ్రెస్​ను బలోపేతం చేయాలంటే చురుకైన పీసీసీ అధ్యక్షుడు అవసరమని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

మా వర్గంకు ఇవ్వాలంటూ..
బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాస్కీలు టీపీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎస్సీ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్‌లు రేసులో ఉన్నారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గంకు నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉన్నందున, అధిక జనాభా కలిగిన బీసీలకు ఆ పదవి ఇవ్వాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు లాంటి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో తిరిగి రెడ్డి సామాజిక వర్గానికే పీసీసీ ఇవ్వడం అవసరమని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిపుష్టత కలిగి అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డిలలో ఒకరికి ఇవ్వాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

అధిష్ఠానం వద్ద ఫిర్యాదులు?
ఇటీవల పార్టీలో ఉన్న అంతర్గత విబేధాలతో కొందరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏ సామాజిక వర్గానికి పదవి కట్టపెట్టడం విషయమై అధిష్ఠానం ఆచి తూచి ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పార్టీలో వివాదరహితుడైన శ్రీధర్ బాబుకి టీపీసీసీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆయన విషయంలో అటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఇటు సీఎల్పీ నేత భట్టి ఇద్దరు కూడా సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపికలో కొంత ఆలస్యమైనప్పటికి అసంతృప్తితో ఉన్న నేతలను దిల్లీ పిలిపించే అవకాశం ఉంది. అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తికి అధ్యక్ష పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం కట్టబెడుతుందని నేతలు భావిస్తున్నారు. చివరి వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి : దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై విచారణ కమిటీకి సుప్రీం విధివిధానాలు

Last Updated : Jan 18, 2020, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details