Telangana PCC New President Selection 2023 : పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించింది. గోవా, దామన్, దాద్రానగర్ హవేలీ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రధానంగా వైసీపీ ఎంపీగా ఉన్న ఆర్.కృష్ణయ్యతో సమావేశం కావడం, గాంధీభవన్‌కు రప్పించి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాష్ట్ర నాయకత్వంతో బేధాభిప్రాయాలున్న నాయకులను ఏకతాటిపైకి తీసుకురాలేక పోవడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
Congress Focus on Parliament Elections 2024 : ప్రొటోకాల్ వాహనం కాకుండా ప్రైవేటు వాహనాల్లో ఆయన వెళ్లడంతో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఇవన్నీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతోనే, పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఠాక్రేను మార్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రత్యేక పరిశీలకురాలిగా పని చేసిన దీపాదాస్ మున్సీని రాష్ట్ర వ్యవహరాల బాధ్యురాలిగా నియమించారు. కేరళ, లక్షద్వీప్‌లతో పాటు తెలంగాణకు అదనపు బాధ్యలు అప్పగించారు. పార్టీ విధేయురాలుగానే కాకుండా, పార్టీని బలోపేతం చేయడంలో నాయకుల మధ్య విబేధాలను సమసిపోయేట్లు చేయడంలో పట్టున్న నాయకురాలిగా మున్సీకి మంచి పేరుంది.
టార్గెట్ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్
12కు తక్కువ కాకుండా: మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం 17 ఎంపీ స్థానాలను హస్తగతం చేసుకోవాలనే కార్యాచరణతో ముందుకెళుతోంది. కనీసం 12కు తక్కువ కాకుండా పార్లమెంటు స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలన్న లక్ష్యంతో పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా పార్లమెంటు ఎన్నికలయ్యే వరకు కొనసాగాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ మార్చితే ఎవరికి ఈ అధ్యక్ష బాధ్యతలు పార్టీ అప్పగిస్తుందా అన్న చర్చ పార్టీ నాయకుల్లో కొనసాగుతోంది.