Revanth reddy fires on recruitment of TSPSC board : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అనర్హులైన సభ్యులతో జరిగిన అన్ని నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేసారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించిన రేవంత్.. వందల కోట్లు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించాలనుకున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్ అయితే.. ఇక్కడ బీఆర్ఎస్ది 30 శాతం కమీషన్ సర్కార్ అని విమర్శించారు.
లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని ఆరోపించారు. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది అని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్కు కనువిప్పు కలిగే విధంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నిరుద్యోగ గర్జనలతో అదిలాబాద్, ఖమ్మం,నల్గొండ, మహబూబ్‌నగర్‌లో ప్రజల్లో విసృత్తంగా అవగాహన కలిగించిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్వపత్రాలన్నింటినీ సంతలో సరుకులు అమ్మినట్లుగా విక్రయించారని ఎద్దేవాచేశారు.
గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల,భీమిని,కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు మీది క్రియాశీలక పాత్ర అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు తనకే సిగ్గనిపిస్తుందని.. పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్‌కు ఏమి అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని.. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లేకేజీకి మంత్రి కేటీఆర్ కారణం అని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
"లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్వపత్రాలన్నింటినీ సంతలో సరుకులు అమ్మినట్లుగా విక్రయించారు. టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలి". - రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు
బీజేపీలాగే.. బీఆర్ఎస్ 30శాతం కమీషన్ సర్కారు ఇవీ చదవండి: