Parents Protest: హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ఆందోళనకు దిగింది. పాఠశాలలు, సాంకేతిక కళాశాలల సిబ్బంది సంఘం, తల్లుల సంఘం, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాలుగు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మరో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని.. అయినా పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం రానుందున తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతుందని సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచి వసూలు చేస్తున్నాయని.. అధిక ఫీజుల భారం భరించలేక అనేకమంది తల్లిదండ్రులు అప్పుల పాలు కావడం, నగలు తాకట్టు పెట్టడం, ఆస్తులు అమ్ముకోవడం జరుగుతోందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఫీజుల బెడద ఎక్కువగా ఉందన్నారు. అందుకు కారణం ఫీజుల నియంత్రణ చట్టం ఏర్పాటు చేయకపోవడమేనని పేర్కొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను అరికట్టి.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా వెంటనే ఫీజుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.