తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంద్రభవనంలా తెలంగాణ నూతన సచివాలయం.. మరో నెలరోజుల్లో అందుబాటులోకి - Telangana new secretariat inauguration

Telangana new secretariat : రాష్ట్ర నూతన పాలనా సౌధం ప్రారంభానికి సిద్ధమవుతోంది. మరో నెల రోజుల్లో కొత్త సచివాలయం అందుబాటులోకి రానుంది. పనులన్నీ దాదాపుగా పూర్తి కాగా.. ఫర్నీచర్ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. పాత ఫర్నీచర్ ఏ మాత్రం ఉపయోగించకుండా పూర్తిగా కొత్త వాటినే అమరుస్తున్నారు. ప్రారంభోత్సవమైన ఒకటి, రెండు రోజుల్లోనే కొత్త సచివాలయం నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభానికి వారం రోజుల ముందు శాఖల వారీగా కేటాయింపులు చేయనున్నారు.

Telangana New Secretariat
తెలంగాణ నూతన సచివాలయం

By

Published : Mar 31, 2023, 7:50 AM IST

ఏప్రిల్​ 30న ప్రారంభంకానున్న నూతన సచివాలయం

Telangana new secretariat: తెలంగాణ కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏప్రిల్ 30వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. వచ్చే నెల 30వ తేదీ ఉదయం ఆరు గంటలా ఎనిమిది నిమిషాలకు మేష లగ్నాన కొత్త సచివాలయంలో వైదికంగా పూజలు ప్రారంభమవుతాయి. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటా 20 నిమిషాల నుంచి ఒంటి గంటా 33 నిమిషాల మధ్య సింహలగ్న శుభ మూహుర్తాన ముఖ్యమంత్రి కేసీఆర్ తన సీట్లో ఆసీనులవుతారు. ఆ తర్వాత మంత్రులందరూ వారి సీట్లలో కూర్చొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాల నుంచి మూడు గంటలా 20 నిమిషాల వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.

కొత్త సచివాలయంలో.. కొత్త ఫర్నిచర్​: ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతున్న వేళ సచివాలయానికి సంబంధించి మిగిలిన పనులను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తుకు సంబంధించిన అన్ని పనులు చాలా రోజుల క్రితమే పూర్తయ్యాయి. మిగిలిన అంతస్తుల్లో ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సచివాలయం కోసం ఫర్నీచర్ అంతా కొత్తగానే కొనుగోలు చేశారు. ఎక్కడ కూడా పాత ఫర్నీచర్ ఉపయోగించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఛాంబర్లు, పేషీలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫర్నీచర్, సామాగ్రి పూర్తిగా ఏకరూపంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇష్టారీతిన కాకుండా అందరికీ ఒకే తరహా ఫర్నీచర్ అమరుస్తున్నారు.

సచివాలయంలో ఉద్యోగుల కేటాయింపు ఏప్రల్​ 25కి పూర్తవుతుంద:ఏప్రిల్ 20వ తేదీ వరకు ఏ పనీ మిగలకుండా అన్ని రకాల పనులు పూర్తవుతాయని అంటున్నారు. ఆ తర్వాత ఆయా శాఖలకు కేటాయింపులు చేయనున్నారు. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ, కేబినెట్ సమావేశ మందిరం, ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉండనున్నాయి. మిగిలిన అన్ని శాఖలకు ఇతర అంతస్తులను కేటాయించనున్నారు. ఒక్కో మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి, మంత్రి పేషీ, సంబంధిత శాఖ కార్యదర్శి, ఉద్యోగులు విభాగాలు ఒకే చోట ఉండేలా కేటాయింపులు జరగనున్నాయి. పాత సచివాలయంలో కొన్ని శాఖలు మినహాయిస్తే మెజార్టీ శాఖలకు సంబంధించి మంత్రి పేషీ ఒక అంతస్తులో.. కార్యదర్శి, ఉద్యోగులు మరో అంతస్తుల్లో ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తు, ఇతరత్రా కారణాల రీత్యా ఎలాంటి మార్పులకు అస్కారం లేకుండా చూస్తున్నారు. కేటాయింపుల ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీ వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు.

ప్రారంభోత్సవం అనంతరం కార్యక్రమాలు అక్కడి నుంచే: ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం అనంతరం.. ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు కొత్త సచివాలయం నుంచి జరిగేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతం సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్ నుంచి కేవలం కంప్యూటర్లు, సంబంధిత సామాగ్రి, దస్త్రాలను మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని ప్రారంభోత్సవం తర్వాత... వీలైనంత త్వరగా వాటిని కొత్త సచివాలయానికి తరలించి పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details