Green Building Award to TS Secretariat: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మించిన డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవనానికి వరుస అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే ఈ సచివాలయ భవనాన్ని చూసి చాలా మంది ప్రముఖులు అభినందలు తెలపగా.. తాజాగా ఈ భవనానికి గ్రీన్ బిల్డింగ్ అవార్డు దక్కింది. భారతదేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియెట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా నూతన సచివాలయ భవనం రికార్డుల్లోకెక్కింది.
ఈ మేరకు రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు అవార్డు ప్రదానం చేశారు. దీనిపై స్పందించిన ప్రశాంత్‌రెడ్డి.. దేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియెట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా గుర్తింపు రావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
Indian Green Building Council Award: అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో సచివాలయ భవనం పర్యావరణహితంగా నిర్మించినట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఘనతంతా ప్రకృతి ప్రేమికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగానే సచివాలయ నిర్మాణం జరిగిందని.. రానున్న రోజుల్లో సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
త్వరలోనే ప్లాటినం అవార్డు కూడా గెలుచుకుంటామని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం ఇందులో నిమగ్నమై పని చేసిన ఈఎన్సీ గణపతిరెడ్డి బృందానికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతిష్ఠాత్మక అవార్డు, అందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని ప్రదానం చేసిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
గోల్డ్ రేటింగ్ ఎలా ఇస్తారంటే..: భవనాల నిర్మాణంలో హరిత ప్రమాణాలను పాటించినట్లు ఆయా సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అవి అలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు ఎంపిక చేసిన నిపుణులతో ఒక కౌన్సిల్ ఉంటుంది. ఆ నిపుణుల బృందం నిర్మాణాన్ని పరిశీలించి నిర్మాణ తీరు తెన్నులు తెలుసుకుంటుంది. ఐజీబీసీ ప్రమాణాల మేరకు నిర్మాణం జరిగినట్లు తేలితే అప్పుడు గోల్డ్ రేటింగ్ ప్రకటిస్తుంది.